భరతమాతకు సేవ చేసే అరుదైన అవకాశం: సివిల్స్ ర్యాంకర్లకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచన
* దీన్ని మీరంతా సద్వినియోగం చేసుకోవాలి
* కృష్ణప్రదీప్ ట్వంటీఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ర్యాంకర్లకు సన్మానం
హైదరాబాద్, మే 4, 2024: భరతమాతకు సేవ చేసే అరుదైన అవకాశం సివిల్ సర్వీస్ ర్యాంకర్లకు మాత్రమే లభిస్తుందని, దాన్ని వాళ్లు సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరకు వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణప్రదీప్ ట్వంటీఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ శిక్షణతో సివిల్స్ ర్యాంకులు సాధించిన 35 మందిని వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్లో శనివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మరో గౌరవ అతిథిగా దూరదర్శన్ మాజీ అదనపు డీజీ డాక్టర్ ఆర్.ఎ. పద్మనాభరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ముందుగా ర్యాంకర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మీ ఈ పయనం మీ జీవితాల్నే కాదు.. ఈ దేశాన్నే మారుస్తుంది. సమాజం, ప్రజలు, దేశం అన్నింటిలో పరివర్తన తీసుకొస్తుంది. 1947లో మొదటి కేంద్ర మంత్రి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఒక మాట చప్పారు. సివిల్ సర్వీసు అధికారులు స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అన్నారు. హామీలు ఇవ్వడం మంచిదే, కానీ వాటిని ప్రజలకు అందించడం అత్యద్భుతం. మీది కేవలం ఉద్యోగం కాదు.. భరతమాతకు సేవ చేసే అరుదైన అవకాశం. మీరు మొదటి అడుగు వేస్తున్నారు. సమాజానికి సేవ చేయడమే అత్యున్నతం. కుల, మత, లింగపరమైన విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ భారతీయులే. ఇక్కడ వేర్వేరు మతాలు, సంస్కృతులు, భాషలు, దేవుళ్లు ఉండొచ్చు. అయినా మనమంతా భారతీయులమేనని గుర్తుంచుకోవాలి. మీ నిబద్దతే మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. మీమీద బోలెడు ఒత్తిడులుంటాయి. రాజకీయ బాస్‌లు ఉంటారు. కానీ మీకు అసలైన బాస్ ఎవరంటే దేశ ప్రజలే. అసలైన భగవద్గీత, బైబిల్ లేదా ఖురాన్ ... భారత రాజ్యాంగమేనని గుర్తుంచుకోవాలి. మీ మనస్సాక్షికే కట్టుబడి ఉండాలి. నిజాయతీతో ఉండాలి. ప్రభుత్వాన్ని మీరే ప్రతిబింబిస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, ప్రధాని ఎవరైనా ఉండొచ్చు గానీ, సేవలన్నీ అందేది మీ ద్వారా మాత్రమే. అత్యున్నత నైతిక విలువలను పాటించాలి. స్వాతంత్య్రం తర్వాత అన్ని స్థాయుల్లోనూ విలువలు కొంత పడిపోతూ వస్తున్నాయి. కానీ ఇప్పటికీ విద్య, వైద్యం, పాలనాయంత్రాంగం మాత్రం అచలంగా ఉన్నాయి. మీకు జన్మనిచ్చిన తల్లి, జన్మభూమి, మాతృభాష, మాతృదేశం.. వీటన్నింటినీ ప్రతి ఒక్కరూ తప్పక గుర్తుంచుకోవాలి. మీరు నిజాయతీపరులైతే అపార గౌరవం లభిస్తుంది. అది మీకు విశ్వాసాన్ని కల్పిస్తుంది. రిఫార్మ్, పెర్ఫార్మ్, అండ్ ట్రాన్స్‌ఫార్మ్ అంటారు. అడ్డంకులన్నింటినీ తొలగించుకుని ముందుకెళ్లాలని గుర్తుంచుకోండి. ప్రజాసేవ, వారి అభివృద్ధికి మీరు నూరుశాతం కచ్చితంగా పనిచేయాలి. నా యుక్తవయసు నుంచి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడాను. మొదట్లో నేను ప్రతిపక్షంలో ఉండేవాడిని. నేను బీజేపీలో చేరినప్పుడు అది ఉత్తరభారతీయుల పార్టీ అని, శాకాహార పార్టీ అని కూడా కొందరు చెప్పారు. కానీ నేను మొదట్లో పూర్తి మాంసాహారిని. ఇప్పుడు శాకాహారిగా మారిపోయాను. మనమంతా మీటింగ్ కోసం వస్తాం గానీ, ఈటింగ్ కోసం కాదని సీనియర్లు చెప్పేవారు. మైకు తీసుకుని, సాయంత్రం వాజ్‌పేయి వస్తున్నారని, అందరూ పెద్దసంఖ్యలో వచ్చి జయప్రదం చేయాలని చెప్పేవాడిని. అలా మైకులో చెప్పే ఒక అబ్బాయి.. ఒక రోజు ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అవుతాడని నేను ఏరోజూ ఊహించలేదు. అలా అవకాశాలు అనేవి ఎప్పుడూ చెప్పిరావు. వచ్చినప్పుడు వాటిని అందిపుచ్చుకుని వాటి సాయంతో వీలైనంత ఎక్కువ సేవ చేయాలి” అని సూచించారు.
దూరదర్శన్ మాజీ అదనపు డీజీ డాక్టర్ ఆర్.ఎ. పద్మనాభరావు మాట్లాడుతూ, యూపీఎస్సీ పరీక్షలలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశలూ దేనికదే పూర్తి ప్రత్యేకమని.. వీటన్నింటిలో వరుసగా విజయాలు సాధించి సివిల్స్ ర్యాంకు పొందడం అంటే చిన్న విషయం కాదని చెప్పారు. ర్యాంకులు సాధించి దేశసేవకు సంసిద్ధులైన యువతను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. వీరిలో విభిన్న నేపథ్యాల వారు ఉన్నారని, కొందరు అత్యంత సామాన్య కుటుంబాల నుంచి వచ్చినవాళ్లయితే మరికొందరు ఉన్నత ఉద్యోగాలను, పెద్ద పెద్ద జీతాలను సైతం వదులుకుని కేవలం సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో వచ్చారని చెప్పారు. 2003లో కేవలం ఇద్దరితో ప్రారంభమైన ఈ అకాడమీ రెండు దశాబ్దాల పయనంలో ఎంతో సాధించిందని, ఇప్పుడు కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారని ప్రశంసించారు.
ఈ అకాడమీ ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేసిందని అకాడమీ ఛైర్మన్ పి. కృష్ణప్రదీప్, చీఫ్ మెంటార్ డాక్టర్ భవానీ శంకర్ తెలిపారు. 2003లో కేవలం ఇద్దరితో ప్రారంభమైన ఈ అకాడమీలో ఇప్పుడు ప్రతియేటా కొన్ని వేల మంది శిక్షణ పొందుతున్నారన్నారు.
“సివిల్స్ సాధించాలన్న కల ఉంటే చాలదు. దానికి సరైన దిశలో సాధన కూడా అవసరం. ఆ సాధన ఎలా ఉండాలన్న విషయంలోనే మేం విద్యార్థులను సరైన దారిలో నడిపించే ప్రయత్నం చేస్తాం. అది అందిపుచ్చుకుని, తగిన ప్రణాళికతో సిద్ధమయ్యేవారిలో కొందరికి ర్యాంకులు వస్తాయి. ఇందులో మార్గదర్శకత్వం, కృషి, అదృష్టం అన్నీ కలగలిసి ఉంటాయి. మేం ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రాం (ఐజీపీ)లో 500 మందికి శిక్షణ ఇస్తే వారిలో 153 మంది ర్యాంకులు సాధించారు. కొందరికి వన్ టు వన్ పర్సనల్ సెషన్లు, మరికొందరికి యూపీఎస్సీ బోర్డు రిటైర్డ్ సభ్యులతో మాక్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహించాం. దీనివల్ల చాలామంది సత్ఫలితాలు సాధించారు. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్, శంషాబాద్‌తో పాటు రాజమండ్రి, ఢిల్లీలలో బ్రాంచిలు ఉన్నాయి. శంషాబాద్‌లో రెసిడెన్షియల్ శిక్షణ ఇస్తున్నాము. ఎలాంటి అర్హత ఉన్నవారైతే సివిల్స్ కోచింగ్ తీసుకోవచ్చు అనేదానికి ఎలాంటి పరిమితి లేదు. 2016లో పదో ర్యాంకు పొందిన రోణంకి గోపాలకృష్ణ పదోతరగతి తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ చేసి ఆ తర్వాత ర్యాంకు సాధించారు. ప్రిలిమ్స్ ఫెయిల్ అయినవాళ్లకు పాంచజన్య లాంగ్ టెర్మ్, మెయిన్స్ ఫెయిల్ అయినవాళ్లకు అప్ స్కేల్, ప్రిలిమ్స్ కంటే ముందు చివరి 3 నెలలు ర్యాపిడ్ రిగరస్ రివిజన్ (ఆర్ఆర్ఆర్)తో కూడిన మిషన్ యోధన్, ప్రిలిమ్స్ క్లియర్ చేసి, మెయిన్స్ కు వెళ్లేవారికి ప్రత్యేకంగా యూపీఎస్సీ మెయిన్స్ 4ఎఎం బ్యాచ్ లాంటి పలు రకాల శిక్షణలు మా సంస్థలో ఇస్తున్నాం. టీఎస్‌పీఎస్సీకి ఈ రెండేళ్లలోనే 10వేల మంది శిక్షణ పొందారు. యూపీఎస్సీ శిక్షణ అంటే ఢిల్లీ మాత్రమే అనే భావనను మేం దూరం చేయగలిగాం” అని వివరించారు.